ఈ వీడియో లో మీరు చూసే ఈ ఘటన, హైదరాబాద్ శివార్లలోని రంగారెడ్డి జిల్లాలో నేను చూసిన, వడ్డెర్ల ప్రాణాపాయ వృత్తి లోని ఒక  కోణం మాత్రమే!

వందల సంవత్సరాలుగా మన రక్త మాంసాలతో భారతావని కట్టడాలు నిర్మించుకుని, పాలకుల నిర్లక్ష్యం వల్ల మన ST హక్కును, తద్వారా మన సాంఘిక ఉనికిని కోల్పోయి, అనుభవిస్తున్న దుర్భర జీవతంలో పామును చూసి భయపడే పరిస్థితి లేదు నాకు అనిపిస్తుంది!

ఇది తెలియని లేదా తెలిసి నటిస్తున్న పాలకులు మరియు కొందరు కుల నాయకులు, మన కుల వృత్తిని ఇతర కుల వృత్తులతో పోల్చి, వారి స్వార్ధానికి వాడుకోవడం శోచనీయం!

ముందుగా, శ్రామిక వడ్డెర్ల శక్తిని వాడుకుంటూ, కులవృత్తిని బడా వ్యాపారంగా మార్చుకున్న కొందరు స్వార్ధ కుల పెద్దలు, "మా బండలు, మా క్వారీలు మాకే కావాలె!" అని చెప్పడాన్ని నేను వ్యతిరేకిస్తున్నాను!

ఈ సున్నితమైన కులవృత్తి అంశంలో, నేను శ్రామికుల పక్షపాతిగానే మాట్లాడతాను, క్షమించండి!🙏

ఇసుక, మట్టి, రాయి సంబంధిత వర్క్స్ మనకులానికి ఇచ్చినా లేక ఇతర కులాలకు ఇచ్చినా, ప్రభుత్వానికి సంక్రమించే ఆదాయంలో 30 శాతం అట్టడుగు వడ్డెర్ల సంక్షేమానికి మాత్రమే వాడాలి! ఇది నా డిమాండు.

ఈ కార్పస్ ఫండు, ఎలాంటి కార్పొరేషన్/ఫెడరేషన్/రాజకీయ పరిమితులు లేకుండా నేరుగా శ్రామిక వడ్డెర్ల ఇంటికే చేరే విధంగా కట్టు దిట్టం చేయాలి. వందల ఏళ్లుగా, మన రక్తం మరియ చెమటతో, భారతావని నిర్మాణాలు చేపట్టిన మన ఋణాన్ని, ప్రభుత్వాలు ఇలా తీర్చుకోవాలని మనం గట్టిగా అడగాలి. 

అలాగే, అన్ని కులాలకు ఇచ్చే లేబర్ కార్డులు, మన కుల వృత్తి కష్టాలకు ఏమాత్రం సరిపోవు అని నేను చెప్పదలుచుకున్నాను. ఇంత రిస్కు ఉన్న కుల వృత్తికి, కార్డు తో పని లేకుండా, ఆరోగ్యం మరియు ఆర్ధిక భద్రత కల్పించగల కార్డు ను ప్రతి వడ్డెర శ్రామికునికి పుట్టుకతో ఇవ్వాలని మనము డిమాండ్ చేయాలి. ఇలా అడగక పోవడంతో, ఈ కార్డులు ఇప్పించడం మరియు ప్రమాదాల తరువాత వచ్చే భీమా సొమ్మును ఇప్పించడం లోకూడా, కొందరు స్వార్ధ నాయకులు(అందరూ కాదు), ఈ వెనుక బడ్డ వడ్డెర్ల వెనుకబాటు తనంతో సొమ్ము చేసుకుంటున్నారు!

చివరగా, నేను శ్రామిక వడ్డెర్ల ST హక్కు పోరును, కులాభ్యుదయంలో, నాణేనికి ఒక వైపు మాత్రమే అని చాలా స్పష్టంగా చెప్తున్నాను.

అయినప్పటికీ, నాణానికి మరో వైపయిన విద్య, లేబర్ కార్డులు మరియు రాజకీయ పదవులను, ST పోరు తో ముడి పెడుతూ, కులాన్ని తికమక పెడుతూ ఉంటే, ST పోరు శక్తిని బలహీన పరుస్తున్నారు. ఇలాంటి వారు, ST పోరు అవసరం మరియు పోరాట విధానం లో, ఉండవలసిన స్పష్టతను కూడా అర్ధం చేసుకోవాలని మరో సారి విజ్ఞప్తి చేస్తున్నాను.

ఇక ఈ వీడియో ద్వారా, మన వారి బండ కష్టాల్లో, పాకే విష సర్పాల కంటే, మన కుల వృత్తిని, తెలివిగా వారి వ్యాపార స్వార్థానికి మరియు రాజకీయ ఎదుగుదలకు వాడుకునే (వళ్లంతా విషం నిండిన) నాయకులు మరియు పాలకుల పాత్రే ఎక్కువ ఉందని కూడా గ్రహించండి!

 (మీ విలువైన అభిప్రాయాలను కూడా తెలుపగలరు) 

మీ సోదరి,
Dr. చంద్రకళ జెరిపేటి
వడ్డెర్ల ST సాధన సమితి
789 368 2052