Why Samiti
There is a need to sustain the long struggle achieve ST status for Telugu vadderas.
(Please refer to the telugu vesrion of this page for detailed explanation of this question until we update the translation)
ముందుగా కుల బంధువులకు నా వందనాలు
న్యాయంగా రావలసిన ST సాధనకై తెలుగు వడ్దెర్ల పోరాటం 1976 నుండి కొనసాగుతున్న విషయం మనకు తెలిసిందే. తెలుగు రాష్ట్రాలే కాదు, దేశం లోని అందరి వడ్డెర్ల మద్దత్తు కూడగట్టుకుని, సంపూర్ణ చైతన్యంతో, ఏక కంఠం తో ఈ డిమాండును ఢిల్లీ వరకు వినిపించడం కోసం ఈ సమితిని స్థాపించడం జరిగింది
కేవలం తెలుగు వడ్డెర్ల ST సాధన కై ఒక సమితిని స్థాపించాలని, నా కుల సోదరులు కోరినపుడు, నేను చాలా మంది కుల బంధువులతో, ఈ సమితి స్థాపన మరి మరియు కార్యాచరణ విషయాలు మాట్లాడాను. ఆ సమయంలో, చాలా మంది పెద్దలు నాకు సలహాలు ఇచ్చి ముందుకు వెళ్లమన్నారు. వారందరికీ, ముందుగా ప్రత్యేక ధన్యవాదాలు!
అలాగే, ఎంతో మంది ఎన్నో ప్రశ్నలు కూడా అడిగారు. సమితిని ప్రారంభించే ఈ తరుణంలో, నాతో మరియు వడ్డెర్ల ST సాధన సమితి తో కలసి, ST సాధన కు సహకరించాలనుకున్న అందరు ఈ 9 ప్రశ్నలు మరియు నా జవాబులు చదవడం ఎంతో అవసరమని నేను భావిస్తున్నాను.
(ఇంకా ప్రశ్నలు ఉంటే, సమాధానాలకై, నా ఫోన్ నంబర్లు 7893682052/9491042052 లకు మెసేజ్/వాట్సాప్ ద్వారా సంప్రదించండి)
(1 వ ప్రశ్న) వడ్డెర్ల ST సాధన సమితి అంటే ఏమిటి మేడం?
(1వ ప్రశ్న జవాబు) వడ్డెర్ల ST సాధన సమితి తెలుగు వడ్డెర్ల 43 ఏళ్ల ST డిమాండు సాధనకోసం పూర్తి శక్తిని పెట్టే విధంగా తయారై మీ ముందుకు వస్తోంది. వ్యక్తులతో సంబంధం లేకుండా, తెలుగు రాష్ట్రాల్లో వడ్డెర్లకు ST వచ్చేవరకు అలుపెరుగని పోరాటం చేయగలిగేవిధంగా రూపొందించబడుతోంది. అలాగే ఈ సంస్థ కేవలం, ST సాధనకు పనిచేస్తూ, ST సాధించిన అనంతరం డిసాల్వ్ చేయబడుతుంది. కుల చరిత్ర మరియు వర్తమాన సాంఘిక స్థితిగతులను అధ్యయనం చేసి, కులంలో విస్తృతంగా పర్యటించి, ఎంతో మంది పెద్దల సలహాలు శ్వీకరించి ఎంతో ఆలోచించి ఈ సమితిని స్థాపించడం జరిగింది•
(2వ ప్రశ్న)ఇప్పటికే వడ్డెర్లు, అసంఖ్యాక సంఘాలతో విసిగిపోయున్నారు! మళ్ళీ ఇంకొక సంఘం అవసరమంటారా?
(2వ ప్రశ్న జవాబు) మీరు చెప్పిన దానిలో వాస్తవం ఉంది! ఇదే విధంగా ఆలోచించి నేను కూడా, మొన్నటి వరకు, కేవలం ఓ వ్యక్తి గా మాత్రమే కులంలో తిరుగుతూ పనిచేసుకుంటూ వెళ్ళాను. ఈ సమయంలోనే, నాకు పరిచయమైన కొందరు యువకులు, ప్రత్యేకించి ST కోసం ఒక సమితి పెట్టాలని నన్ను కోరడం జరిగింది. వారు చెప్పిన విషయం ఆలోచిస్తే, నిజంగా, ఇప్పటిదాకా, కులం కోసం పని చేస్తున్న సంఘాల్లో, కేవలం ST కోసం పోరాడుతున్న వారు అరుదు అని తెలిసింది. ఒక్క యజ్ఞంలా చేయవలసిన మన కోర్ డిమాండ్ ST పోరాటం, ఈ రోజు ఎన్నో సర్ఫేస్ డిమాండ్స్ వల్ల వెనక్కు నెట్టబడింది. అందుకే, కేవలం ST కోసమే పోరాడగలిగే ఒక సంఘాన్ని స్థాపించి, సాధన దిశగా ముందుకు వెళితే బాగుంటుందని ఈ ప్రయత్నం చేయడం జరిగింది.
(3వ ప్రశ్న) 43 ఏళ్లుగా వడ్డెర్ల ST పోరాటం సాగుతూనే ఉంది. మరి, ఇంకా ఎందుకు తెలుగు వడ్డెర్లు తమ న్యాయమైన ST డిమాండ్ను సాధించలేకపోయారు?
(3వ ప్రశ్న జవాబు) సంఖ్యాపరంగా తెలుగు వడ్డెర్లు 80 లక్షల పైచిలుకు ఉన్నప్పటికీ, అందులో 90 శాతం మేరకు వడ్డెర్లు అక్షరాస్యత లేని శ్రమ జీవులు కావడం ముఖ్య కారణం. అందుచేత, పాలకులే కాదు, కొంత మంది కుల నాయకులు సైతం, వడ్డెర్ల ST ఆకాంక్షను కేవలం నోటికి లేదా కాగితానికి పరిమితం చేసి కులానికి తీరని అన్యాయం చేస్తున్నారు. పెద్ద కులం కావడం చేత, కొంత మంది బాగుపడ్డవారు, SC/STలలో చేరడం నామోషీగా భావించి, ST సాధనలో సహాయంచేయడంలేదు. ఇంకొందరు, మధ్యయుగం( Medieval Period) నుండి, భారతావనిలో వడ్డెర్లకు జరిగిన సాంఘిక అన్యాయాలు (CT/DNT దొంగల సాంఘిక మరక) తెలియక, లేదా తెలుసుకోలేక, మన ST డిమాండులో న్యాయం లేదన్న భ్రమలో ఉన్నారు. మరికొందరు, మనకు ST వస్తే SC/ST వారు ఊరుకోరు అనే అపోహలో కూడా ఉన్నారు. ఇలాంటివారందరు, BC/MBC/DNT అంటూ పవిత్ర ST పోరాటాన్ని, ఎవరి స్థాయిలో వారు, నీరు కారుస్తున్నారు. అన్యాయంగా BC లో తోయబడ్డ మనము, 50 ఏళ్లుగా BC ల్లో ఉంటూ, వడ్డెర్లు ఏ మాత్రం బాగుపడలేదు, అనే కఠోర వాస్తవాన్ని, కొందరు నాయకులు, కేవలం పదవులు లేదా 'ప్రైడ్'(pride) కోసం తెలివిగా దాచేస్తున్నారు. ఇలాంటి వారు, వడ్డెర్ల కోర్ ST డిమాండును వెనక్కి నెట్టి, BC రాగాన్ని ఆలపించడం, ST సాధనలో, ప్రస్తుతం, పెద్ద అవరోధంగా మారింది.
(4వ ప్రశ్న) అయితే, ఇన్ని అవరోధాలు ఉన్న వడ్డెర్ల ST పోరాటలో, మీరు ఏ నమ్మకంతో , విజయాన్ని సాధించగలననుకుంటున్నారు?
(4వ ప్రశ్న జవాబు) ఇందులో మర్మమేమి లేదండి! భారతదేశం ప్రజాస్వామ్యం, ఇక్కడ సంఖ్యాపరంగా ఎక్కువ ఉన్న వర్గాల, న్యాయమైన ఆకాంక్షలు తీర్చవలసిన అవసరం, ఓట్లు అడిగే, ఏ పార్టీకైనా తప్పదు, అనే విషయం మనకు తెలియంది కాదు. కులం అనేది, పుట్టుకతో సంక్రమించి, మరణం వరకు ఉండే, సాంఘిక బలం లేదా బలహీనత గా ఉన్నది కాబట్టే, ఇలా మాట్లాడక తప్పడం లేదు (అభ్యుదయ వాదులు క్షమించాలి) మా సంఖ్యే మాకు బలం; మరియు మా ST పోరాటానికి ఊపిరి. ఇప్పుడు మేం చేయవలసింది చాలా సింపుల్; నాయకులతో పనిలేకుండా ఐకమత్యంతో, ఏక ఖంఠంతో ST ఆకాంక్షను ప్రభుత్వానికి, పాలకులకు వినిపించడమే! గల్లీ నుండి ఢిల్లీ వరకు అందరికీ, మా న్యాయమైన డిమాండును వివరిస్తూ, మద్దతు కూడ గట్టుకుంటూ, ముందుకు వెళితే చాలు, ST డిమాండ్ సాధించ గలమని, నేను నమ్ముతున్నాను.
(5వ ప్రశ్న) అయితే మీ సమితికీ, మరియు మిగితా సంఘాలకు తేడా ఉందంటారు! అది ఏమిటో, కాస్త వివరించండి?
(5 వ ప్రశ్న జవాబు) ముందుగా చెప్పినట్టు ఈ సమితి, కేవలం ST సాధన కోసమే పనిచేస్తుంది మరియు ST సాధించిన వెంటనే అంతర్ధానమవుతుంది. వడ్డెర్ల ST సాధనలో జండావిష్కరణలు, పదవి శ్వీకరణ మహోత్సవాలు, భారీ ఫ్లెక్సీలు, భారీ ర్యాలీలు, గజమాలలు, భూరి సన్మానాలు, మందు మాంసాల వంటి ఆర్భాటాలు ఉండవు.
(6వ ప్రశ్న) అలా అయితే, మీ సమితి యొక్క ప్రత్యేకతను తెలపండి?
(6వ ప్రశ్న జవాబు) ప్రత్యేకతలు అనడం కంటే ST సాధనకు కావలసిన ప్రత్యేక అవసరాలు అని అంటే బాగుంటుందేమో! ముందుగా మా సమితిలో సభ్యులు మరియు సభ్యత గురించి చెబుతాను. ST ఆకాంక్ష మనసులో (కేవలం మాట లో మాత్రమే కాదు) ఉన్న వడ్డెర్లు, ప్రాంతాలకతీతంగా, మాతో ప్రయాణించచ్చు! ప్రతి సభ్యుడు సమిటిని కూడా, ప్రశ్నించే విధంగా, ఒక నామమాత్ర రుసుమును కూడా శ్వీకరిస్తున్నాము. ఇంకా వివరంగా చెప్పాలంటే, ఉద్యోగస్తులకు 100 రూపాయలు, విద్యార్థులకు 10 రూపాయలు ప్రవేశ రుసుము ఉంటుంది. శ్రామికులకు మాత్రంకేవలం ఒక్క రూపాయిగా నిర్ణయించాను. కుల చైతన్యం లో మహిళల పాత్ర ఎంతో ముఖ్యమైనది కాబట్టి, ఒక మహిళ నడిపే ఈ సంఘంలో, మహిళలనుండి ఎలాంటి ప్రవేశ రుసుము శ్వీకరించడంలేదు. కేవలం పేరు మరియు మొబైల్ ఫోన్ నంబరు ఉన్నవారు ఎవరైనా, ఈ సమితిలో సభ్యులు కావచ్చు. అన్ని దేశాల వడ్డెర్లు సైతం, కేవలం మొబైల్ ఫోన్ సాయంతో, ప్రవేశ రుసుము చెల్లించడమే కాదు, అన్ని సమితి కార్యక్రమాల్లో సమానత్వం మరియు పూర్తి పారదర్శకతో, ST సాధనకై సహకరించడానికి వీలుగా అన్ని వివరాలు సమితి వెబ్సైటు www.vsss.info లో పొందు పరుస్తున్నాము. సభ్యులు కావడానికి జిల్లాల వారీగా నియమించబడే ఇన్ఛార్జిలు ముఖ్య పాత్ర పోషించనున్నారు. పదవులు పని చేయటానికే అన్నట్టు, ఇక్కడ అందరూ సమాన హక్కులు మరియు బాధ్యతలతో మెలిగే విదంగా ఈ సమితిని రూపొందిస్తున్నాము. సంఘం లెటర్హెడ్స్, కార్డ్స్, స్టేట్మెంట్స్లో కూడా వ్యక్తులకంటే ST సాధనకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. సభ్యులు మరియు సభ్యత పూర్తి వివరాలు, ఈ వెబ్సైట్లో అందరు వడ్డెర్లకు అందుబాటులో ఉంటాయి. అలాగే, సాంకేతికతను ఉపయోగించుకుని, సమితి కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొన గలిగిన, వడ్డెర యువత, ప్రాంతాలకతీతంగా, ఎడిటర్ పాత్రను పోషించబోతున్నారు. వీరి విధులు మరియు నిబంధనలను ఇప్పటికే రూపొందించాము. (ఈ సమితి బాధ్యతలను శ్వీకరించి, ST సాధనకు సహకరించాలనుకునే వారు నా నంబర్లు 7893682152/9491042052 కు మెసేజ్/వాట్సాప్ చేయ వచ్చు)
(7వ ప్రశ్న) ఇప్పటివరకు ఉన్న అధిక సంఘాలు, నిధులు సమకూర్చుకోవడం మరియు ఖర్చుపెట్టడం విషయంలో, పారదర్శకత కు అసలు ప్రాధాన్యత ఇవ్వలేదు అన్న విమర్శలు ఉన్నాయి! ఇంత పెద్ద పోరాటానికి మీ సొంత నిధులు ఎలాగూ సరిపోవు, కాబట్టి మీరు ST సాధనకు సమకూర్చుకునే నిధుల ఖర్చును సభ్యుల అభిప్రాయాలకనుగుణంగా, పారదర్శకతతో, ఎలా ఖర్చు చేస్తారు?
(7వ ప్రశ్న జవాబు) అవును, ఏ పోరాటానికైనా ఆర్ధిక వనరులే, కీలకం! వ్యక్తిగా నేను మరియు నా భర్త, మా సంపాదనలో కొన్ని లక్షలు ఇప్పటికే విరాళాలు, దానాలు, లేబర్ కార్డులు, వడ్డెర బస్తి పర్యటనలు, వడ్డెరటైమ్స్ వెబ్సైటు, సమితి స్థాపన వగైరాలపై ఖర్చుచేయడం జరిగింది. కులం కోసం, మా విలవైన సమయం ఇవ్వడం మా కర్తవ్యంగా మాత్రమే భావించగలిగాము కాబట్టే, ఇది సాధ్యపడింది అనుకుంటున్నాము. ఇప్పుడు సమితి స్థాయిలో ST పోరాటం చేయాలంటే, మా ఇద్దరి సంపాదన లేదా సమయం ఏ మూలకు సరిపోదు! అందుకే మేము కూడా విరాళాలు సేకరించవలసిందే! అయితే, ఏ విరాళమైనా, నగదు రూపంలో కాకుండా, కేవలం ఆన్లైన్ ట్రాన్సక్షన్ ద్వారానే శ్వీకరిస్తాము. విరాళాల వివరాలను, ఎప్పటికప్పుడు, సంఘం వెబ్సైట్లో ప్రచురించడం జరుగుతుంది. అలాగే సభ్యత్వ రుసుములు కూడా, అందరికీ తెలిసే విధంగా, నేరుగా కరెంట్ అకౌంట్లోకే, చేరే విధంగా, సమితిని రూపొందించాము.
(8వ ప్రశ్న) నిధులు సమకూర్చుకోవడం వరకు OK! ఈ నిధుల ఖర్చు మరియు పారదర్శకతపై, ఇంకొంచం వివరణ ఇస్తారా?
(8వ ప్రశ్న జవాబు) నేను ముందే చెప్పినట్లు, ST సాధన సమితిలో ప్రతి రూపాయి, కేవలం ST పోరాటానికి మాత్రమే వాడటం జరుగుతుంది. ఇందులో ఎలాంటి సందేహాలు లేవు. ఖర్చు చేసే ప్రతి రూపాయికి లెక్కలు మరియు అకౌంట్ స్టేట్మెంట్సు, సభ్యులు చూసే విధంగా, ప్రతి నెల మొదటి వారంలో, సంఘం వెబ్సైట్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. చెక్ పవర్ కూడా ఒకరు లేదా ఇద్దరికే పరిమితం చేసి, అవసరం అయితే, వెబ్సైటు లో, ఆన్లైన్ వోటింగ్(సమితి వెబ్సైటు లో, సభ్యుల పోల్స్) ద్వారా కూడా, ఖర్చు పెట్టవలసిన అంశాలపై మెజారిటీ నిర్ణయం, తీసుకోవడం జరుగుతుంది.
(9వ ప్రశ్న) చివరిగా ఒక ప్రశ్న, మీరు కులంలో చేసే ప్రతి పని, శ్రీ ఇమ్మడి సిద్ధరామేశ్వరస్వామి ఆశీస్సులతో చేస్తున్నట్టు కనిపిస్తుంది. దీనికి ఏమైనా ప్రత్యేక కారణాలు ఉన్నాయా?
(9వ ప్రశ్న జవాబు) అవును! ఒక ప్రత్యేక కారణం ఉంది! మనం తల్లి, తండ్రి, గురువు, దైవం అని ఆంటాము కదా! నాకు మూడు సంవత్సరాల వయసు నుంచి తల్లి లేదు. నా తండ్రి, నాకు చేసిన సాంఘిక అన్యాయం, మీకు తెలియనిది కాదు. ఇక మిగిలింది గురువు మరియు దైవము. అందులోనూ, ST లాంటి పెద్ద పోరాటం చేయాలంటే, దైవంతో పాటు, భోవి గురు, ఇమ్మడి సిద్ధరామేశ్వర స్వామి వారి ఆశీస్సులు కూడా చాలా అవసరం. ఈ నేపథ్యంలో, మన స్వామివారి గురించి రెండు ముక్కలు చెప్పి ముగిస్తాను. నేను స్వామివారిని చిత్రదుర్గలోని ఆయన ఆశ్రమంలో, రెండు సార్లు దర్శనం చేసుకున్నాను. ఒక మతం ద్వారా, కులానికి, గురువు అయినప్పటికీ, సామాజిక స్పృహతో, ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా, ఆయన చేస్తున్న కృషిని నేను ప్రత్యక్షంగా చూసి, నా పోరాటాన్ని మరియు మా పోర్టల్స్ ( www.holyshrines.in & www.vadderatimes.com) కూడా స్వామివారి ఆశీస్సులతోనే ప్రారంభించాము. అంతే కాదు! ఈ క్లిష్టమైన ST పోరాటంలో, స్వామి వారి ద్వారా, ఇతర రాష్ట్ర వడ్డెర్ల సహాయం కూడా తీసుకుంటున్నాను.
🙏సమాప్తం🙏
ST సాధనకు మీ సహాయ సహకారాలను కోరుతూ,
మీ సోదరి,
Dr. చంద్రకళ జెరిపేటి
వడ్డెర్ల ST సాధన సమితి