Attachment | Size |
---|---|
వడ్డే_ఓబన్న_జయంతి_ఉత్సవాల_పాంప్లెట్.pdf (297.11 KB) | 297.11 KB |
వడ్డే ఓబన్న 1816 జనవరి 11న రేనాటి ప్రాంతంలో జన్మించారు. ఓబన్న గారు సంచార జాతికి చెందిన, వడ్డెర కులానికి చెందిన వారు.
ఆ కాలంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా ఆధీనంలో ఉన్న భారతదేశంలో, రేనాటి పాలేగాళ్లకు మరియు కుంఫనీ(ఈస్ట్ ఇండియా కంపెనీని రేనాడులో అలా పిలిచే వారు) కి తవర్జీ(అధికారాన్ని కుంఫనీకి ఇచ్చినందుకు పాలెగాళ్లకు ఇచ్చే భత్యం) విషయంలో ప్రారంభమైన ఘర్షణలు, క్రమేపీ సాయుధ పోరాటాలుగా మారాయి.
ఆ పోరాటాల్లో ముఖ్యమైనది, నొస్సం పాలెగాడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చేసిన సాయుధ పోరు. ఈ భీకర పోరులో, సైన్యాధ్యక్షుడిగా వడ్డే ఓబన్న పోషించిన వీరోచిత పాత్రను, చరిత్రలో తక్కువ చేయడం, అత్యంత దురదృష్టకరం. భయం ఎరుగని వడ్డెర్లు, బోయలు మరియు చెంచులతో కూడిన సంచార తెగల సైన్యాన్ని, సమర్ధవంతంగా నడిపించి, దట్టమైన నల్లమల అడవుల్లో సైతం, కుంఫనీ సైన్యాన్ని ఊచకోత కోసి ఉరుకులు పెట్టించడంలో ముఖ్య పాత్ర పోషించిన వీరుడు మన వడ్డే ఓబన్న.
నరసింహా రెడ్డికి ముఖ్య అనుచరుడిగా, తన నాయకుడిని మరియు అతని కుటుంబాన్ని కూడా కాపాడటంలో, ముఖ్య పాత్ర పోషించిన వడ్డే ఓబన్న వీరత్వం సమాజం మరచి పోవడాన్ని, ఈ రోజు వడ్డెర జాతి చాలా సీరియస్ గా తీసుకుంది.
కనీసం ఇప్పటి నుండైనా, స్వతంత్ర వీరుడు వడ్డే ఓబన్నకు తగినంత గుర్తింపు లభిస్తే, సంచార జాతి వడ్డెర కులానికే కాదు, బడుగు బలహీన వర్గాలందరికీ సంఘంలో గౌరవం లభిస్తుందని భావించి, జనవరి 11న వడ్డే ఓబన్న జయంతిని ఘనంగా జరుపుకుంటున్నాము. ఈ సంచార జాతి స్వతంత్ర వీరుడి, జన్మదిన వేడుకల్లో పాల్గొని, నివాళులు అర్పించి, అతని త్యాగాలు, భావి తరాలకు స్ఫూర్తినిచ్చేలా ప్రాచుర్యం చేయాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. జోహార్ స్వతంత్ర సమర వీరా! జోహార్ వడ్డే ఓబన్నా!